
డ్రెయిన్‌లో పడి బాలుడి మృతి
నకరికల్లు: డ్రెయిన్‌లో పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని కుంకలగుంటలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మస్తాన్‌వలి, ఖైరాబి దంపతుల కుమారుడు షేక్ ఇషాన్‌అహ్మద్(2). రెండురోజులుగా భారీ వర్షం పడుతున్న క్రమంలో శనివారం మధ్యాహ్నం సమయం తరువాత తల్లీకొడుకు ఇద్దరూ కలసి తమ ఇంటిముందు నిలబడ్డారు. అప్పటి వరకు భారీ వర్షం పడడంతో వారి ఇంటిముందున్న డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తుంది. కొడుకును బయట కూర్చోబెట్టిన తల్లి చీపురుకోసం ఇంట్లోకి వెళ్లి వచ్చింది. ఒక్క నిమిషం వ్యవధిలోనే చిన్నారి ఇషాన్ అహ్మద్ కనిపించకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్న సమయంలో రెడ్డిపాలెం సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద ఉన్న చిన్నపాటి వాగులో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వర్షంనీటికి ఉధృతంగా ప్రవహిస్తున్న డ్రెయిన్‌లో పడడంతో గల్లంతై ఊపిరాడక మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.