
కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిది
నగరంపాలెం: కొండవీడు రాజుల సాహిత్యసేవ మరువలేనిదని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కలెక్టర్ బంగ్లారోడ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో ఆదివారం కొండవీడు హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యంలో మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’ నాటకానికి కాటయ వేమారెడ్డి రచించిన ‘కుమారగిరి రాజీయమ్’ వ్యాఖ్యాన గ్రంథ– ఆవిష్కరణ సభ నిర్వహించారు. సభకు డాక్టర్ డీఎన్ దీక్షిత్ అధ్యక్షత వహించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రంథం కొండవీడు రాజుల సాహిత్య ప్రతిభాపాటవానికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ కొండవీడు పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు కల్లి శివారెడ్డి గణనీయమైన కృషి చేస్తున్నారని అన్నారు. గ్రంథ సంపాదకుడు మోదుగుల రవికృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి కల్లి శివారెడ్డి, గ్రంథ ప్రచురణ కోసం సహకరించిన ఆవుల మురళీధర్‌రెడ్డి, ఆవుల సుశీల దంపతులు పాల్గొనగా, డాక్టర్ కాజ సుబ్రహ్మణ్యం నిర్వహణలో కొల్లి అక్షయరెడ్డి నాట్య ప్రదర్శన అలరించింది.