
ఫార్మసీ ప్రవేశాలకు వేళాయే !
ఏపీ ఈఏపీ సెట్–2025 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో కొనసాగనున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు
దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2025)లో అర్హత సాధించిన విద్యార్థులు ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. బైపీసీ స్ట్రీమ్‌లో అర్హత సాధించిన విద్యార్థుల మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆన్‌లైన్ ఆధారిత కౌన్సెలింగ్ జరగనుంది. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 16వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌తో పాటు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉంది.
ఆన్‌లైన్‌లో కళాశాలల జాబితా
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 43 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు తమ ఇళ్లలోని పర్సనల్ కంప్యూటర్‌తో పాటు ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలు, ఫార్మసీ కళాశాలల నుంచి సహాయాన్ని పొందవచ్చు. అయితే, తమ ర్యాంకు, ఫీజు చెల్లించిన రసీదు వివరాలు, కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్ల నమోదుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుకోవాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో పొందుపర్చిన జాబితా నుంచి తాము చేరదలచుకున్న కళాశాలలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుతో
మొదలయ్యే ప్రక్రియ
ఏపీ ఈఏపీసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. ఎస్‌ఈటీఎస్.ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో చెల్లించాలి. ఏపీ ఈఏపీ సెట్ డిటైల్డ్ నోటిఫికేషన్, యూజర్ మాన్యువల్, కళాశాలల జాబితా, విద్యార్థులకు మార్గదర్శకాలను ఇదే సైట్‌లో పొందుపర్చారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది.
ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో పూర్తి చేశారు. అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సమీపంలోని హెల్ప్‌లైన్ కేంద్రంలో పరిశీలన చేసి, అన్నీ సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.