
తురకపాలెం మరణాలపై జెడ్పీలో చర్చ
అంతుచిక్కని మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి చైర్‌పర్సన్ వివరాలు సేకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలపై జెడ్పీ స్థాయి సంఘ వేదికగా చర్చ జరిగింది. సమావేశ మందిరంలో గురువారం సంఘాలు భేటీ అయ్యాయి. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు గానూ మూడు సంఘ సభ్యులు గైర్హాజరుతో కోరం లేక వాయిదా పడింది. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా అధ్యక్షతన 1,2,4,7వ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తురకపాలెంలో చోటు చేసుకున్న మరణాలపై వైద్యారోగ్యశాఖాధికారుల నుంచి వివరాలు సేకరించారు. పల్నాడు జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. తాగునీటి పంపిణీకి పంపిణీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారని రూరల్ వాటర్ వర్క్స్ ఎస్‌ఈ కల్యాణ్ చక్రవర్తిని హెనీ క్రిస్టినా ప్రశ్నించగా, తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. అనంతరం ప్రణాళిక, ఆడిట్, గ్రామ పంచాయతీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం, రహదారులు భవనాలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ట్రెజరీ, స్టాంపులు రిజిస్ట్రేషన్ ,రవాణా శాఖ, గనులు భూగర్భ వనరుల శాఖ, భూగర్భ జల వనరుల శాఖ, గృహ నిర్మాణ సంస్థ, సహకార శాఖ, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, గ్రామీణ పరిశ్రమల మండలి, పరిశ్రమల శాఖ, ప్రణాళిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల వారీగా వివిధ అంశాలపై చర్చించారు. పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ మాట్లాడుతూ జిల్లా పరిషత్తు ఆధ్వర్యంలో ముద్రించిన విద్యాజ్యోతి పుస్తకం వల్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని 599 మార్కులు సాధించిందని తెలిపారు. 577 మార్కులు సాధించిన విద్యార్థులు 100 మందికి పైగా ఉన్నారని వివరించారు. గుంటూరు జిల్లా డీఈఓ సీవీ రేణుక మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫాంతో పాటు మెరుగైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, ఓఎస్డీ పి.శివన్నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.