
ఈత కొట్టడానికి దిగి నీటి ప్రవాహంలో గల్లంతు
కొమ్మమూరు కాలువలో మృతదేహం లభ్యం
కారంచేడు: రోజూ మాదిరిగానే ఈత కొట్టేందుకు కాలువలో దిగిన వ్యక్తి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. ఉదయం నుంచి గజ ఈతగాళ్లు గాలించి సాయంత్రానికి మృతదేహాన్ని బయటకు తీశారు. కారంచేడు తహసీల్దార్ జి. నాగరాజు, ఎస్‌ఐ షేక్ ఽఖాదర్ బాషా పరిస్థితిని సమీక్షించారు. వివరాలు... కారంచేడు గ్రామానికి చెందిన దగ్గుబాటి హరిప్రసాద్ (68) చీరాల కొత్తపేటలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. రోజూ చీరాల నుంచి కారంచేడు వరకు సైకిల్‌పై వెళ్లి కొమ్మమూరు కాలువ కట్టపై కొద్దిసేపు గడిపి కాలువలో ఈత కొట్టేవాడు. గురువారం కూడా ఈత కొట్టే క్రమంలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించ లేదు. ఆయన భార్య కారంచేడులోని బంధువులకు ఫోన్‌లో సమాచారం అందించారు. వారు వచ్చి కాలువ దగ్గర పరిశీలించగా ఆయన సైకిల్, విడిచిన దుస్తులు కనిపించాయి. కాలువలో పడిపోయి ఉంటాడని భావించి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి సమాచారం అందించారు. తహసీల్దార్ జి. నాగరాజు, ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషాలు గాలింపు చర్యలు చేపట్టారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు పరిస్థితిని సమీక్షించారు. ఆయన సూచనతో ఈపురుపాలెం నుంచి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు ముమ్మరం చేశారు. ఈతకు దిగిన కొద్ది దూరంలోనే మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. హరిప్రసాద్‌కు భార్య, వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఆర్థిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక డిమాండ్లలో ప్రభుత్వ సాచివేత ధోరణికి వ్యతిరేకంగా నిరసన వారం ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలను ధరించి, ప్రదర్శనలు నిర్వహించారని తెలిపారు. శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించి, తహసీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
తెనాలి అర్బన్: తెనాలి పట్టణంలో అధికారికంగా డెంగీ కేసు నమోదైంది. ఈ విషయం బయటకు రావడంతో పట్టణంలో కలకలం మొదలైంది. తెనాలి 17వ వార్డుకు చెందిన 60 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం కొద్దిరోజుల కిందట వెళ్లాడు. అతడిలో డెంగీ లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులు రక్త పరీక్షలు చేయించడంతో వ్యాధి నిర్ధారణ అయింది. విషయాన్ని ప్రభుత్వ వైద్యశాల అధికారులు తెనాలి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వ్యక్తి నివసించే ప్రాంతంలో మురుగు కాల్వలను బాగు చేయించి బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేయిస్తున్నారు.

ఈత కొట్టడానికి దిగి నీటి ప్రవాహంలో గల్లంతు