
దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. భౌతికంగా దూరమైనా ఆయన ఇప్పటికీ తెలుగుజనం గుండెల్లో గుడి కట్టుకొన్నారు. ఆయన వారసుడిగా వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గడచిన అయిదేళ్లు జనరంజక పాలన సాగించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధరలతో పాటు వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించి జనం మన్ననలు పొందారు.
పేదల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు
పేదల గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి వర్థింతి వేడుకలు మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ఇందుకోసం వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో దివంగతనేత విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేయనున్నారు. వాడవాడలా వైఎస్ వర్థంతి కార్యక్రమాలు ఘనంగా జరగనున్నాయి. వైఎస్సార్ కాంగ్రె స్‌పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
బాపట్ల జిల్లా అభివృద్ధికి కృషి
జిల్లాకు వైఎస్ చేసిన మేలును జనం మరోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. అద్దంకి ప్రాంత అభివృద్ధి కోసం పెద్దఎత్తున పనులు చేపట్టారు. జలయజ్ఞంలో భాగంగా రూ. 70 కోట్లతో భవనాశి రిజర్వాయర్, రూ. 175 కోట్లతో ఎర్రం చినపోలిరెడ్డి పథకంతో పాటు కొరిశపాడు ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. రూ. 1100 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో మేదరమెట్ల నుంచి నార్కెట్‌పల్లి వరకూ జాతీయరహదారిని నిర్మించారు. ఒంగోలు ప్రాంతంనుంచి హైదరాబాద్‌కు దగ్గర దారిని ఏర్పాటు చేసిన ఘనత దివంగత నేత వైఎస్‌దే.

దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు