
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం
బాపట్ల: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. ప్రతి సమస్యను చిత్తశుద్ధితో తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పత్రికల్లో వచ్చిన వార్తలపై ఆరా
పత్రికల్లో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ప్రశ్నించారు. వాటిపై వారు వివరణ ఇచ్చారు. ప్రతి గురువారం ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహిస్తారన్నారు. దీనికి సంబంధిత అధికారులంతా నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచే విధంగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
చెత్తను తగలబెడితే చర్యలు
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు పంపకుండా వాటిని తగలబెట్టి పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. సేకరించిన తడి, పొడి చెత్తలను డంపింగ్ యార్డ్‌లో మాత్రమే ఉంచాలని, వాటిని ఎప్పటికప్పుడు జిందాల్ పరిశ్రమకు తరలించాలని ఆదేశించారు. చెత్తను రోడ్లకు ఇరువైపులా వేయడం, కాల్వలలో, కుంటల్లో పడవేయడం, తగులబెట్టడం చేస్తున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కౌలు రైతులకు సహకరించాలి
జిల్లాలో కౌలు రైతులందరికీ సీసీఆర్సీ కార్డులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్డులు పొందిన రైతులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు సహకరించడం లేదని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లాస్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆయన డీఏఓ, ఆర్డీఓ, ఎంఏఓలను ఆదేశించారు. డ్రోన్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని, దాన్నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని, రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయకూడదని స్పష్టం చేశారు. డ్రోన్‌లు అవసరమైన ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలను తయారు చేసి జేసీకి అందజేయాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్‌గౌడ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశం