
నిమజ్జనంలోనూ కూటమి రాజకీయ కుట్ర
చుండూరు(వేమూరు) : కూటమి నేతలు రాజకీయ కుట్రతో వినాయకుడి నిమజ్జనంలోనూ వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి చేశారు. చుండూరు మండలంలోని కేన్‌పల్లిలో ఆదివారం నిర్వహించిన విగ్రహాం ఊరేగింపులో కూటమి నాయకులు రోడ్డు వద్ద కాపు కాసి దాడులకు పాల్పడ్డారు. కూటమి నాయకుల నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు సోమవారం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కూటమి నాయకులకు చుండూరు సీఐ శ్రీనివాసరావు పూర్తిగా కొమ్ము కాయడంతో దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడుల్లో నష్టపోయామంటూ ఏడు కుటుంబాలు కలసి సీఐ, కూటమి నాయకులపై సోమవారం ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.
సర్పంచ్ హత్యకు కుట్ర
గ్రామ సర్పంచ్ అంగిరేకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేన్‌పల్లిలో వైఎస్సార్ సీపీ ప్రాబల్యం ఎక్కువుగా ఉందని, పార్టీ లేకుండా చేసేందుకు తనను హత్య చేసేందుకు కూటమి నాయకులు కుట్రలో భాగంగా దాడి చేసినట్లు ఆరోపించారు. విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ జెండాలు ఉండటంతో సీఐ శ్రీనివాసరావు పిలిపించారని, జెండాలు, పాటలు పెట్టితే బెయిల్ రాకుండా కేసులు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. విగ్రహం తీసుకొని వెళుతుండగా కొత్తపల్లి గ్రామం వద్ద గుమ్మ రఘు వర్గీయులు రోడ్డుకు అడ్డంగా బైక్‌లు పెట్టారని వివరించారు. బైక్ తీయాలని అడిగితే రఘు వర్గీయులు చుండూరు గ్రామానికి చెందిన బాలకోటిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. ఆయన మూడు కారుల్లో కొంత మంది వ్యక్తులను తీసుకొని వచ్చి ట్రాక్టరులో ఉన్న మహిళలపై దాడులు చేశారని నాగేశ్వరరావు ఆరోపించారు. మెడలో ఉన్న బంగారం కూడా లాక్కొన్నారని చెప్పారు. సీఐ శ్రీనివాసరావు కూటమి నాయకులకు వత్తాసు పలకడంతో బాలకోటిరెడ్డి తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని, దాన్నుంచి తప్పించుకున్నట్లు ఆరోపించారు. సీఐ వల్ల వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రాణ హాని ఉందని, రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు బాధితులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడి