
గోవా సంస్కృతి బాపట్లకు తేవద్దు !
బాపట్ల టౌన్: పర్యాటకం, అధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన సూర్యలంక తీరంలో గోవా తరహాలో విష సంస్కృతి తీసుకు వస్తే చూస్తూ ఊరుకునేది లేదని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిజీ తెలిపారు. పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ స భ్యుడు ప్రతాప్‌కుమార్ నివాసంలో సోమవారం వి లేకరులతో మాట్లాడారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 14న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ న్యాయవాదులను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా సోమవారం బాపట్లకు వచ్చారు. శివ స్వామీజీ మాట్లాడుతూ ఇటీవల వార్తల్లో బాపట్ల సూర్యలంక సముద్రతీరాన్ని మినీ గోవా తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, వాటిని చూసి చాలా బాధ కలిగిందని తెలిపారు. సహజసిద్ధంగా ఏర్పడిన సూర్యలంక తీరం అటు పర్యాటకంగా, ఇటు అధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతమని పేర్కొన్నారు. కార్తిక మాసంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తీరానికి లక్షల్లో తరలి వస్తున్నారని పేర్కొన్నారు. పుణ్య స్నానాలు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా తీరంలో తారకేశ్వరస్వామి, ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆధ్యాత్మికంగా ఉన్న ప్రాంతంలో విష సంస్కృతికి బీజాలు నాటే నిర్ణయాలను తిప్పికొడుతామని చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, తీరంలో చెడు సంస్కృతి అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు. అప్పటికీ మారకపోతే న్యాయపోరాటం చేయటానికై నా వెనుకాడేది లేదని స్వామీజీ స్పష్టం చేశారు. సమావేశంలో విశాఖపట్టణం అడ్వకేట్ కె. రవిశంకర్, బాపట్ల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ
సూర్యలంక తీరం అధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం
విష సంస్కృతికి బీజాలు
అడ్డుకునేందుకు పోరాటం