
కక్షపూరితంగా తొలగించారు
పెదకూరపాడు : తనను కక్షపూరితంగా తొలగించారని శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి వాపోయారు. తన భర్త మైనేని ప్రతాప్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. పల్నాడు జిల్లా పార్టీ యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారని కక్షపూరితంగా తనను శ్రీ సత్య సాయి స్వయం సహాయక సంఘం నుంచి అన్యాయంగా తొలగించారని వాపోయారు. ఈ మేరకు మండలంలోని లగడపాడు గ్రామానికి చెందిన మైనేని స్రవంతి తహసీల్దార్ ధనలక్ష్మికి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. గత పది సంవత్సరాల నుంచి సంఘం సభ్యురాలుగా నిబద్ధతతో వ్యవహరించానని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లింపులు చేశానని, తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నామని తొలగించడం దారుణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. స్వయం సహాయక సంఘాలపై కూడా రాజకీయాలు ఏమిటని ఆమె ప్రశ్నించారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్రవంతి కోరారు.
శ్రీ సత్యసాయి స్వయం సహాయక సంఘ సభ్యురాలు మైనేని స్రవంతి
వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా
భర్త వ్యవహరిస్తున్నారని కక్ష