
ప్లాస్టిక్‌ను తరిమికొడదాం
బాపట్ల మున్సిపల్ కమిషనర్ జి రఘునాథరెడ్డి
బాపట్ల అర్బన్: బాపట్ల సూర్యలంక తీరంలో వాడి పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ఆవు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం చాలా బాధాకరమని మునిసిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మన అవసరాల నిమిత్తం బహిరంగ మార్కెట్లో సులభంగా, ఉచితంగా లభించే ప్రమాదకర ప్లాస్టిక్‌ను ఉపయోగించడం వలనే మూగ జీవాలు ప్రమాదాలకు గురౌవుతున్నాయని చెప్పారు. ఆవుల యజమానులు పట్టణ వీధుల్లో సూర్యలంక తీరంలోకి ఆవులు వదిలేయడంతో అనేకమైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అనారోగ్యానికి గురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదకర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడకం వలన మానవాళితోపాటు మూగ జీవాలు కూడా ప్రమాదం బారిన పడుతున్నాయన్నారు. వీటిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని సూచించారు.