
ఆర్‌ఓబీకి ముందే ఆర్‌యూబీ నిర్మించాలి
ప్రజారవాణాకు ఇబ్బందులు లేకుండా చూడాలి
నష్టపరిహారం చెల్లించకుండా భవన యజమానులను ఖాళీ చేయాలని బెదిరించడం అధికారులకు తగదు
మీడియా సమావేశంలో బెటర్ శంకర విలాస్ ఫ్లయ్ ఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్.ఎస్.భారవి
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్‌విలాస్ నూతన ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టే ముందుగానే ప్రజా రవాణాకు వీలుగా రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)ని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ సాధన జేఏసీ కన్వీనర్ ఎల్‌ఎస్ భారవి డిమాండ్ చేశారు. మంగళవారం గుంటూరులోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశంలో ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి ముందే ఆర్‌యూబీ నిర్మించాలని చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపి ఆమోదింపచేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్‌యూబీ నిర్మాణానికి నిధులు తెచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆర్‌యూబీ నిర్మాణం దిశగా రైల్వేశాఖను ఒప్పించాలని కోరారు. శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించే ఆర్నెల్ల పాటు బ్రిడ్జిపై వాహనాలు యధావిధిగా రాకపోకలు సాగించవచ్చని జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించేశారని చెప్పారు.
– బ్రిడ్జికి రెండు వైపులా కూల్చివేసిన ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు రైల్వే పరిధిలోని బ్రిడ్జి కూల్చివేత పనులకు అనుమతుల కోసం తీరిగ్గా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్లడం ముందుచూపు లోపించిన పనులకు నిదర్శనమన్నారు. అన్ని అనుమతులు తెచ్చిన తరువాతే బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం రైల్వేబోర్డు అనుమతి కోసం పంపడం ద్వారా నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని మరింతగా జాప్యం చేయడమేనన్నారు. బ్రిడ్జి నిర్మాణం కారణంగా నష్టపోతున్న భవన యజమానులకు చట్ట ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించాలని హైకోర్టు స్పష్టంగా చెప్పడంతోపాటు స్టేటస్–కో విధించినప్పటికీ అధికార యంత్రాంగం ఖాతరు చేయకండా ఏకపక్షంగా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉండగానే రెండు రోజుల్లో భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. నగర ప్రజలపై గౌరవం లేని అధికారులు కనీసం హైకోర్టుపై గౌరవంతో ఆదేశాలను పాటించాలని కోరారు.
– నగర ప్రజలతో పాటు నిర్మాణాలను కోల్పోతున్న యజమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని అన్ని అనుమతులు తెచ్చుకుని బ్రిడ్జి కూల్చివేత, నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్‌యూబీ నిర్మాణానికి నిధుల గురించి ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్‌యూబీ నిర్మాణాన్ని రైల్వేశాఖ చేపడుతుందని చెప్పారు. సమావేశంలో షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు, కమల్‌కాంత్, అవధానుల హరి, వల్లూరి సదాశివరావు పాల్గొన్నారు.