
చినగంజాంలో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఇన్ చార్జి గాదె మధుసూదనరెడ్డి
జిల్లా వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు
దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు, క్షీరాభిషేకాలు
అన్నదానాలు, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ
కార్యక్రమాల్లో పాల్గొన్న సమన్వయకర్తలు వరికూటి, గణేష్, గాదె
వేడుకల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు,
అభిమానులు దివంగత నేతను గుర్తు చేసుకున్న జనం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఫీజు రీయింబర్స్‌తో పేద, మధ్యతరగతి బిడ్డలకు ఉన్నత చదువులు.. ఆరోగ్యశ్రీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లు... జలయజ్ఞంతో సాగునీటి పథకాల నిర్మాణం.. అన్నదాతలకు ఉచిత విద్యుత్... ఒకటా రెండా వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి జనం గుండెల్లో గుడికట్టుకున్న నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఆయన విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్పత్రుల్లో రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. పేదలకు దుస్తులు పంచారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. దివంగత నేత పాలనలో జిల్లాలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి జనం మారోమారు గుర్తుచేసుకున్నారు.
● వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో దివంగత వైఎస్ రాజశేకరరెడ్డి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వేమూరు మండలం పెరవలిలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అమర్తలూరు మండలం ప్యాపర్రులో జరిగిన అన్నదాన కార్యక్రమంలో వరికూటి పాల్గొన్నారు. తర్వాత కొల్లూరు మండలంలో దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భట్టిప్రోలులో జరిగిన వర్ధంతి కార్యక్రమాలలో కూడా అశోక్‌బాబు పాల్గొన్నారు.
● రేపల్లె నియోజకవర్గంలో సమన్వయకర్త ఈవూరి గణేష్ ఆధ్వర్యంలో దివగంత నేత వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి గణేష్ పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● బాపట్లలో సమన్వయకర్త కోన రఘుపతి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజెర్ల నారాయణరెడ్డి 23వ వార్డులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య కర్లపాలెం రోడ్డులో దివంగత నేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
● చీరాలలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆదేశాల మేరకు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జేషన్‌బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబుల ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● అద్దంకి నియోజకవర్గంలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన సోదరుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 20వ వార్డులో దివంగత నేత విగ్రహానికి పూలమాల వేశారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దివంగత నేత వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు వాడవాడలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.
● పర్చూరు నియోజకవర్గంలో సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు దివంగతనేత వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత పర్చూరు బొమ్మల సెంటర్, నెహ్రూనగర్‌లలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చినగంజాంలోని మార్కెట్, రైల్వేస్టేషన్ సెంటర్లలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మార్టూరు మండలం చిమ్మిరిబండ, ఇంకొల్లు మండలం పావులూరులలో దివంగత నేత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.