
డీజిల్ దొంగ అరెస్ట్
నరసరావుపేటటౌన్: ఆగి ఉన్న లారీల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన మంగళవారం పట్టణంలో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసంజీవయ్య కాలనీకి చెందిన కాకాని యశ్వంత్ చిలకలూరిపేట రోడ్డు ముస్లిం శ్మశానవాటిక పక్కన గల పెట్రోల్ బంకు ఆవరణలో నిలిపి ఉన్న లారీలో తెల్లవారుజామున డీజిల్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన పెట్రోల్ బంకు సిబ్బంది కేకలు వేయటంతో తన వెంట తెచ్చుకున్న ద్విచక్రవాహనం, 25 లీటర్ల రెండు క్యాన్‌లు వదిలి పరారయ్యాడు. రెండు గంటల తర్వాత మరో ద్విచక్ర వాహనంపై అతని స్నేహితుడితో కలిసి వచ్చి వదిలి వెళ్లిన వాహనాన్ని తీసుకెళ్లాడు. అప్పటికే యశ్వంత్ కోసం అక్కడ వేచి చూస్తున్న లారీ యజమానులు, పెట్రోల్ బంకు నిర్వాహకులు అతన్ని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని నెలలుగా లారీల్లో డీజిల్, బ్యాటరీలు అపహరణకు గురవుతున్నాయని లారీల నిర్వాహకులు పోలీసులకు వివరించారు. నిందితుడితోపాటు అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకొని డీజిల్ దొంగతనం చేసేందుకు తెచ్చిన ప్లాస్టిక్ క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

డీజిల్ దొంగ అరెస్ట్