
జామ్..జామ్ జామాయిల్!
జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సాగు 12 ఏళ్ల పాటు దిగుబడి ఎకరాకు 20 టన్నుల నుంచి 60 టన్నుల వరకు వచ్చే అవకాశం ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం చవిటి భూములూ సాగుకు అనుకూలం
ఆదాయం బాగుంది..
అద్దంకి: వరితో పాటు వాణిజ్య పంటలూ నష్టాలను తెస్తున్న తరుణంలో అన్నదాతలు వణికిపోతున్నారు. ఇక చౌడు భూములున్నా లేనట్లే. అయితే ఇలాంటి నేలలున్న రైతులకు యూకలిప్టస్ (జామాయిల్) సాగు అనుకూలంగా ఉంటుంది. కాగితం పరిశ్రమతో పాటు, రేయాన్ పరిశ్రమ, మెడికల్ రంగాల్లో దీనిని విరివిగా వాడుతుండటంతో జామాయిల్ కర్రకు గిరాకీ పెరిగింది. జిల్లాలో 2 వేల ఎకరాల్లో జామాయిల్ సాగు చేసిన రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ఒక్కో మొక్క రూ.1 నుంచి రూ. 3
సంవత్సరానికి 400 మిల్లీ మీటర్ల నుంచి 12 వేల మిల్లీ మీటర్ల వర్షపాతం ఉన్న ప్రాంతాల్లోని చౌడు, బీడు భూములతో పాటు, సారవంతమైన భూముల్లోనూ జామాయిల్ సాగు చేసుకోవచ్చు. జూన్, జూలై, ఆగస్టు నెలలు అనుకూలం. 400కు పైగా రకాలున్నప్పటికీ 3, 7, 316, 413 రకాల క్లోన్‌లను నాటుకోవచ్చు. ఎకరాకు 888 మొక్కలు అవసరం అవుతాయి. 25 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ మొక్కలు ఖమ్మం జిల్లాలో విరివిగా దొరుకుతుండగా.. రవాణా ఖర్చులతో కలుపుకుని మొక్క రూ.1 నుంచి 3 రూపాయల వరకు వ్యయం అవుతుంది.
నాలుగవ సంవత్సరం నుంచి కర్ర దిగుబడి..
నాటిన నాలుగో సంవత్సరం నుంచి కర్ర దిగుబడి వస్తుంది. ఎకరాకు సాధారణ భూముల్లో నీటి తడులు, ఎరువులు అందించిన తోటల్లో అయితే 40 నుంచి 60 టన్నుల మేర వస్తుంది. చౌడు భూములు, బీడు భూములు అయితే 30 నుంచి 40 టన్నుల వరకు కర్ర దిగుబడినిస్తుంది. అంటే ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.1.5 లక్షల నుంచి రూ.2లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉన్నట్లే. తరువాత నాలుగు సంవత్సరాలకు ఒక సారి మొత్తం మూడు సార్లు కర్ర దిగుబడితో ఆదాయాన్ని ఇస్తుంది.
మార్కెట్ ఎలా ?
రైతు నేరుగా పేపర్ కంపెనీలకు లేదా, లైసెన్సు పొందిన కర్ర కొనుగోలు దారులకు కర్రను విక్రయించుకోవచ్చు. కర్రను కాగజ్ నగర్, భద్రాచలం, జేకే పేపర్ మిల్ వారు కొనుగోలు చేస్తున్నారు. చౌడు భూములు, బీడు భూముల్లో సాగు చేసుకోవడం ఉత్తతమని అధికారులు చెబుతున్నారు.
సాధారణ పంటలు వేసి ఆదాయం లేక విసుగెత్తి జామాయిల్ సాగు చేశా. తెల్ల నేల కావడంతో మూడు సంవత్సరాలకే కొట్టుడు వస్తుంది. గతంలో ధర తక్కువగా ఉన్నా.. ఈ సంవత్సరం కర్ర ధర బాగుండడంతో టన్న ధర రూ.6 వేలు పలికింది. మంచి ఆదాయం వచ్చింది.
– హనుమంతరావు, రైతు