
రాష్ట్రంలో రెడ్‌బుక్ అరాచక పాలన
బాధితుడు పైనే కేసు నమోదు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ అరాచక పాలన నడుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో వైఎస్సార్ సీపీ నేతలు ఆసుపత్రులు, జైళ్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం సరిపోతోందని తెలిపారు. వినుకొండ నియోజకవర్గం టి. అన్నవరంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి, గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్‌ను మంగళవారం పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి పరామర్శించారు. దాడిలో వెంకట ప్రసాద్ సోదరు డు వెంకటేశ్వర్లుకు అయిన గాయాలను పరిశీలించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్‌గా వెంకట ప్రసాద్ పని చేయడంతో అతడిని అంతం చేయాలని ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు సింపుల్‌గా 324 కేసు వేశారని తెలిపారు. రాజీపడమని నోటీసులు తీసుకునే సింపుల్ కేసు నమోదు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వానికి తొత్తుగా పని చేస్తోందని విమర్శించారు. న్యూట్రల్‌గా ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తున్నారని ఆరోపించారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఎల్లకాలం ఉండడదని, రానున్న రోజుల్లో వేరే బుక్కులు వసాయనే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మాచర్లలో రెండు టీడీపీ ముఠాలు కొట్టుకొని హత్యలు చేసుకుంటే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే వినుకొండలో రషీద్ అనే వైఎస్సార్ సీపీ కార్యకర్తను అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు. రాష్ట్రంలో ఇంత అరాచకాలు జరుగుతున్నా డీజీపీ, ఎస్పీలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులపై న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్ సీపీ నేత వెంకట ప్రసాద్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే అతడి పైనే కేసు నమోదు చేయడం దారుణమని ఖండించారు. హత్యాయత్నానికి గురైన బాధితుడుపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేయడం చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఎంత బలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగిందంటూ వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.