‘వర్రీ’ నారు! | - | Sakshi
Sakshi News home page

‘వర్రీ’ నారు!

Aug 26 2025 7:34 AM | Updated on Aug 26 2025 7:34 AM

‘వర్రీ’ నారు!

‘వర్రీ’ నారు!

భారీ వర్షాలతో నీటి మునిగిన పొలాలు అదును దాటిపోతుందనే ఆందోళనలో అన్నదాతలు అధిక ధరలు వెచ్చించి నారు కొనుగోలు సెంటు రూ. 2 వేలు పలుకుతున్న వైనం

బాపట్ల టౌన్‌: అతివృష్టి... అనావృష్టి... పరిస్థితుల మధ్య ఈ ఏడాది అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. మొన్నటి వరకు కాలువల ద్వారా నీరు విడుదల కాకపోవడం, వరుణుడు కరుణించకపోవడంతో అసలు సాగు చేస్తామో లేదోనన్న సందిగ్ధంలో రైతన్నలు ఉండేవారు. నార్లు పోసుకునేందుకు కూడా ముందుకు రాలేదు. నాటు వేసిన తర్వాత ఇటీవల భారీ వర్షాలకు ముంపునకు గురై నిండా మునిగారు. ఇప్పుడు మళ్లీ నాట్లు వేయాలంటే అదనపు భారం తప్పడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో అత్యధికంగా ఈ ఏడాది వెద పద్ధతిలో సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రికార్డు స్థాయిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరుణుడికి తోడు కాలువలు పొంగిపొర్లడంతో జిల్లాలోని లంకగ్రామాలు, తీరప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. జిల్లాలోని బాపట్ల, రేపల్లె, కొల్లూరు, నిజాంపట్నం, నగరం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చీరాల, చినగంజాం, వేటపాలెం ప్రాంతాల్లో సుమారు 40 వేల హెక్టార్లలో వెద పద్ధతిలో, నాట్లు రూపంలో వరి సాగు చేశారు. భారీ వర్షాల కారణంగా పొలంలో నిలిచిన నీరు 10 రోజులకుపైగా నిలిచి ఉండటంతో పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరిగి మరోసారి వెద పెట్టేందుకు అవకాశం లేకపోవడంతో రైతులు తప్పనిపరిస్థితిలో నార్లు కొనుగోలు చేసి నాటేందుకు సిద్ధమయ్యారు.

డిమాండ్‌ పెరిగిందిలా...

నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో పొలాలు ఉరకెక్కే అవకాశం ఉండటంతో రైతులు సూదూర ప్రాంతాల నుంచి నారు కొనుగోలు చేసి నాట్లు వేసే పనిలో నిమగ్నం అయ్యారు. రైతుల అవసరాలను అవకాశంగా భావించిన వ్యాపారులు నారు ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేశారు. జిల్లా నలుమూలల నుంచి నార్లు కొనుగోలు చేసేందుకు కర్లపాలెం, బాపట్ల మండలాల్లోని మెరక ప్రాంతాల రైతులు అధిక సంఖ్యలో రావడంతో ధరలు కొండెక్కాయి. సాధారణంగా గతంలో నారు ధరలు సెంటు రూ. 450 నుంచి రూ.600 వరకు మాత్రమే ఉండేంది. డిమాండ్‌ పెరగడంతో సెంటు నారు రూ. 2000 దాటింది. గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు కొనుగోలు చేస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో విక్రయం

బాపట్ల మండలంలోని దరివాదకొత్తపాలెం, వెదుళ్లపల్లి, నందిరాజుతోట, కొండుబోట్లవారిపాలెం, చిల్లరగొల్లపాలెం, కర్లపాలెం మండలంలోని నందాయపాలెం, నల్లమోతువారిపాలెం, కర్లపాలెం, చీరాల మండలంలోని ఈపూరుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం ప్రాంతాల్లో నారు లభ్యం అవుతోంది. గరువు నేలలు కావటంతో ఇక్కడ నారుకు మంచి డిమాండ్‌ ఉంది. ఆయా గ్రామాల్లో రైతులు నారును విక్రయిస్తున్నారు.

కొండెక్కిన ధరలతో కర్షకులు విలవిల

పెరిగిన ఖర్చుల భారం

నేను ఈ ఏడాది నాలుగు ఎకరాలు వెద పద్ధతిలో సాగు చేశా. ఇప్పటికే రెండుసార్లు వెద పెట్టినందుకు ఒక్కో ఎకరాకు రూ. 12 వేల చొప్పున ఖర్చు పెట్టాను. ప్రస్తుతం సెంటు నారు రూ. 2 వేల చొప్పున నాలుగు ఎకరాలకు కొనుగోలు చేశా. ఎరువులు, పురుగుమందులు సబ్సిడీపై అందజేయాలి.

– గేరా శ్యామ్యూల్‌, ఈతేరు

ఈ ఏడాది అన్నీ నష్టాలే

ఈ సంవత్సరం ఏ గడియలో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టామో కానీ అన్ని నష్టాలే వెంటాడుతున్నాయి. ప్రస్తుతం సెంటు నారు రూ. 2 వేలకు పైగా పలుకుతోంది. కౌలు చెల్లించుకుంటూ అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితికి వచ్చాం. మాలాంటి చిన్న, సన్నకారు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.

– కోటేశ్వరరావు, పూండ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement