
దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ
అడ్డగోలుగా పింఛన్ల రద్దు తగదు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: దివ్యాంగులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందని మాజీ డెప్యూటీ స్పీకర్, పార్టీ బాపట్ల సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించటంపై సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి ఆయన వినతి పత్రం అందించారు. వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అర్హులైన వారికీ పింఛన్లు తొలగించారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విలేకరుల సమావేశంలో కోన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు ఉంటే వాటిలో లక్ష మందికి తొలగిస్తూ నోటీసులు జారీ చేయటం తగదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చే సమయంలో అన్ని రకాల పింఛనుదారుల సంఖ్య 33 లక్షలు ఉండగా.. దానిని రెట్టింపు చేసినట్లు వివరించారు. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇచ్చేలా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని తెలిపారు. సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా తొలగింపునకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. విచారణ పేరుతో అన్ని పథకాలు తొలగిపోతాయని తెలిపారు. దివ్యాంగులకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమం చేపడితే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని సూచించారు. అలాంటి కేసులకు భయపడేదే లేదన్నారు. చల్లా రామయ్యను ఓదార్చి సెల్ టవర్ నుంచి దించే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నాయకులపై కూడా అక్రమ కేసులు పెట్టారన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని కోన చెప్పారు. దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, తన్నీరు అంకమ్మరావు, జోగి రాజా పాల్గొన్నారు.
జగనన్న కాలనీని గ్రామంలో కలపొద్దు
ఉప్పరపాలెం సమీపంలోని జగనన్న కాలనీని మూలపాలెం లో చేర్చేలా కూటమి ప్రభుత్వం ప్రయత్నించటం సరికాదని కోన రఘుపతి సూచించారు. మూలపాలెం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన గ్రామమని, దీంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కూడా వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ మేరకు సర్పంచ్ బి.అనిల్ ఆధ్వర్యంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారని తెలిపారు.