
ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
బాపట్ల: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వినతి పత్రాలను స్వయంగా స్వీకరించి, కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించారు. త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మొత్తం 190 వినతులు అందాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
ప్రభుత్వ భూములను ఆక్రమించి భవనాలు నిర్మిస్తే కూల్చివేయాలని, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బాపట్ల డీఎల్‌డీవోకు ఆదేశించారు. స్వామిత్వ సర్వే పురోగతిపై ఎంపీడీవోలతో ఆయన సమీక్షించారు. ప్రతిరోజు ఈ తరహా సమీక్ష నిర్వహిస్తానని, అధికారులందరూ నివేదికలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీక్షణ సమావేశం నిర్వహిస్తారని, అందుకు అధికారులందరూ నివేదికలతో రావాలని పేర్కొన్నారు. పీ4 కార్యక్రమంలో నీడ్ బేస్డ్ సర్వేను వందశాతం పూర్తి చేయాలని ఆయన ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు. తల్లికి వందనం పథకంలో ఈకేవైసీ పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించి ఆపరేషన్లు చేసిన డాక్టర్లకు, ఏఎన్‌ఎంలకు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల ఆర్డీవో గ్లోరియా పాల్గొన్నారు.