
‘ఉపాధి’కి అవినీతి తూట్లు!
రూ.4 కోట్ల మేరకు అవినీతి?
అలా విచారణ తగదు
బల్లికురవ: ఉపాధి హామీ పథకం మండలంలో అపహాస్యం పాలైంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మండంలోని 21 గ్రామ పంచాయతీల్లో 645 పనులను రూ.12 కోట్లతో చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. మస్టర్లు, కొలతల్లో వ్యత్యాసాలు, మొక్కలు నాటని వైనం, చేసిన పనులే మళ్లీ చూపుతూ రూ.కోట్ల ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లింది. జిల్లా, మండల స్థాయి అధికారులు పర్సంటేజీలకు అలవాటు పడి ఇవేమీ పట్టించుకోలేదు. గ్రామాల వారీగా సామాజిక తనిఖీల్లో అవినీతి జరిగినట్లు నిర్ధారించాయి. బల్లికురవలో ఈ నెల 6, 7వ తేదీల్లో జరిగిన బహిరంగ ప్రజావేదికలో ఈ మేరకు వెల్లడించారు. ఇది జరిగి 20 రోజులైనా అక్రమార్కులపై చర్యలు లేవని కూలీలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.
ౖపైపెనే విచారణ
నక్కబొక్కలపాడు, కొమ్మినేనివారిపాలెం, వేమవరం, అంబడిపూడి, కొణిదెన, చెన్నుపల్లి, గొర్రెపాడు, వల్లాపల్లి, కె.రాజుపాలెం, కూకట్లపల్లి, వెలమవారిపాలెం గ్రామాల్లో రూ. 1.5 కోట్ల మేర పనులకు క్వాలిటీ కంట్రోల్ బృందం నివేదికలు ఇవ్వాల్సి ఉంది.
మల్లాయపాలెం గ్రామంలో సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగులు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు 70 మందికి బోగస్ మస్టర్లు వేసి రూ. 20 లక్షలు వరకు స్వాహా చేశారని జిల్లా కలెక్టర్ వెంకట మురళికి, డ్వామా పీడీ విజయలక్ష్మికి ఆధారాలతో మల్లాయపాలెం మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ ఫిర్యాదు చేశారు. విచారణను గతంలో ఎంపీడీవో పాండురంగస్వామికి కలెక్టర్ అప్పగించారు. ఆయన స్థానిక ఏపీవో జి. రమాదేవికి ఆ బాధ్యత అప్పగించారు. ఏపీవో భాగస్వామ్యం ఉన్నా అధికారులు ఆమెకే విచారణ బాధ్యతలు అప్పగించడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఊరు పేరు అవినీతి
మొత్తం (రూ.లక్షల్లో)
వి.కొప్పరపాడు 50
ఉప్పుమాగులూరు 39.67
అంబడిపూడి 49.33
ముక్తేశ్వరం 35
బల్లికురవ 12
వల్లాపల్లి 1.57
మల్లాయపాలెంలో 8
వెలమవారి పాలెం 1.04
వైదన 3.78
కొప్పరపాలెం 8.3
కొమ్మినేనివారి పాలెం 0.96
వేమవరం 0.80
గుంటుపల్లి 0.65
కొణిదెన 0.16
చెన్నుపల్లి 0.16
గొర్రెపాడు 0.04
ఉపాధి పనుల్లో అవినీతిపై తగిన ఆధారాలతో ఫిర్యాదు చేశా. విచారణకు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఏపీవోను పంపడమేంటి? ఆమె ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటబెట్టుకుని విచారణ ఎలా చేస్తారు? అక్రమాలను కప్పిపుచ్చి అధికారులు తప్పుడు నివేదికలు సమర్పించారు. తగిన ఆధారాలతో పంచాయతీ రాజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తాం. ఇతర మండలాల అధికారుల విషయంలో మళ్లీ విచారణ చేపట్టాలి.
– అబ్బారెడ్డి బాలకృష్ణ, మాజీ సర్పంచ్

‘ఉపాధి’కి అవినీతి తూట్లు!

‘ఉపాధి’కి అవినీతి తూట్లు!