పండుగ తరువాతే పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పండుగ తరువాతే పరిశీలన

Aug 26 2025 7:34 AM | Updated on Aug 26 2025 7:34 AM

పండుగ తరువాతే పరిశీలన

పండుగ తరువాతే పరిశీలన

28 నుంచి డీఎస్సీ–2025 మెరిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లాలో భర్తీ చేయనున్న 1,143 పోస్టులు గుంటూరు ఏసీ కళాశాలలో ముమ్మర ఏర్పాట్లు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వినాయకచవితి పండుగ తరువాతే ప్రారంభం కానుంది. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–2025 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో వివిధ కేటగిరీల వారీగా ఆయా పోస్టులకు ఎంపికై న వారికి పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 28 నుంచి చేపట్టనుంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ప్రారంభం కావాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసిన అధికారులు వినాయకచవితి పండుగ సెలవు దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి చేపట్టేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ‘సాక్షి’కి తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో 1,143 పోస్టులు

డీఎస్సీ–2025 ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో 1,143 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 622, ఎస్జీటీ 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లిష్‌ 69, మ్యాథ్స్‌ 35, ఫిజికల్‌ సైన్స్‌ 58, బయాలాజికల్‌ సైన్స్‌ 86, సోషల్‌ 109, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 166తో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 521 ఉన్నాయి.

ఏసీ కళాశాల వేదిక

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భర్తీ చేయనున్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన 1,143 పోస్టులకు గతంలో 25,067 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు గల అర్హత ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఒక దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు రెండు పోస్టులకు కలిపి దాఖలు చేసిన దరఖాస్తులతో కలుపుకొని ఆన్‌లైన్‌లో మొత్తం 43,570 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుషులు 8,431, మహిళా అభ్యర్థులు 16,636 మంది ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్‌ 6వ తేదీ నుంచి జరిగిన ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. వీరిలో ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను గురువారం నుంచి గుంటూరులోని ఏసీ కళాశాలలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు విద్యాశాఖ కార్యాలయం ద్వారా నేరుగా సమాచారాన్ని పంపుతారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు చేపడతామని డీఈఓ సీవీ రేణుక చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement