
చెరువులో పడి యువకుడు గల్లంతు
కొల్లూరు: చెరువులో పడి ఓ యువకుడు గల్లంతైన సంఘటన కొల్లూరు శివారు బోస్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోస్ నగర్‌కు చెందిన సభావత్తు గోపీనాయక్ (34) రోజువారి కూలిపనులు చేసుకుంటూ తల్లితో కలసి జీవనం సాగిస్తున్నాడు. అతని తల్లి అతని కుమార్తె వద్దకు పొన్నూరు వెళ్లడంతో సోమవారం రాత్రి సమీపంలోని తన పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. తన పెద్దమ్మ ఇంటి వద్ద నుంచి తిరిగి వచ్చే క్రమంలో గ్రామాన్ని ఆనుకొని ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో చెరువు పక్కనే నివసిస్తున్న ఓగృహిణి చీకట్లో చెరువు నీళ్లలో పడి గోపీనాయక్ కొట్టుమిట్టాడుతున్నట్లు గమనించి స్థానికులను అప్రమత్తం చేసింది. వారు టార్చ్‌లైట్ల సాయంతో వెతికేందుకు ప్రయత్నించినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. యువకుడు గల్లంతైన సమాచారం అందుకున్న కొల్లూరు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. రాత్రి సమయం కావడంతో యువకుడి కోసం గాలించే అవకాశాలు లేకపోవడంతో గజ ఈతగాళ్ల సాయంతో వెతికించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువకుడు చెరువులో గల్లంతవడానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడవ్వాల్సి ఉంది.