
మానవ రహిత భారత్ అమిత్‌షా లక్ష్యం
సత్తెనపల్లి: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్‌గా మారుస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోస్యం చెబుతున్నారని, వాస్తవానికి మానవ రహిత భారత దేశంగా మారుస్తారని ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది చిలుకా చంద్రశేఖర్ ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పీఎం రెడ్డి గార్డెన్స్‌లో మావోయిస్టు పార్టీ అమరుడు, మంజీరా పై వచ్చిన వివా కామ్రేడ్ రవి పుస్తకావిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సభకు విరసం కార్యదర్శి రివేరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీల వంటి గుప్పెడు మంది కార్పొరేట్ ప్రయోజనాల కోసం మధ్య భారతంలో ఖనిజ వనరులను కొల్లగొట్టడానికి అడవులను నరికేసి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకోసం ఆదివాసీ ప్రజా ప్రతిఘటన పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులను చంపేస్తామని ప్రకటించడం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ లేదని చెప్పారు. విప్లవ రచయితల సంఘం నాయకులు పాణి మాట్లాడుతూ మావోయిస్టు అమర వీరుడు, విప్లవ రచయిత మంజీరా సాహిత్యం, జీవితం త్యాగపూరితమని వివరించారు. తొలుత ప్రజా కళామండలి కళాకారులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. మంజీరా జీవన సహచరి తాయమ్మ కరుణ వివా కామ్రేడ్ రవి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్