
అతివల రక్షణే పోలీస్ ధ్యేయం
బాపట్లటౌన్: మహిళల రక్షణే పోలీస్ ధ్యేయమని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం విద్యార్థినులు ఎస్పీకి రాఖీ కట్టి ముందస్తుగా రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత విద్యార్థినులతో ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలల పరిస్థితి, ఏవైనా సమస్యలున్నాయా? ఎవరైనా ఆకతాయిలు వేధిస్తున్నారా? తదితర విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ రాఖీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. రక్షణగా, అండగా నిలిచే సోదరుడికి రాఖీ కట్టి, క్షేమంగా, సుఖసంతోషాలతో ఉండాలని సోదరీమణులు కోరుకుంటారన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని పోలీసులకు రాఖీలు కట్టడం కేవలం సాంప్రదాయానికి మాత్రమే కాకుండా, పోలీస్ శాఖపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. మహిళల భద్రత కోసం ఏ సమస్య వచ్చినా పోలీస్ సహాయం క్షణాల్లో పొందేందుకు ‘శక్తి యాప్‘ రూపొందించినట్లు తెలిపారు. అనుకోని ఆపద వచ్చినపుడు, తక్షణ సహాయం అవసరమైనప్పుడు, యాప్‌లోని ఎస్‌ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే నిమిషాల్లో సంబంధిత పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని భద్రత కల్పిస్తారన్నారు. మహిళలకు 24/7 అందుబాటులో ఉండే శక్తి వాట్సాప్ నంబర్ 79934 85111ను ఇటీవల అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాలోని మహిళలకు రక్షణ కల్పిస్తూ, ఈవ్ టీజింగ్‌లను అరికట్టేందుకు, మహిళలకు చట్టాలపై వారి హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు జిల్లాలో 5 శక్తి బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి శక్తి బృందానికి ఎస్‌ఐ స్థాయి అధికారి ఇన్‌చార్జిగా ఉంటారన్నారు. విద్యార్థులు, మహిళలు మౌనం వీడి నిర్భయంగా ముందుకు వచ్చి తమ సమస్యలు చెప్పినప్పుడే మరింత భద్రత కల్పించగలమన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహిళలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ