
సీజనల్ వ్యాధుల నియంత్రణ ముఖ్యం
బాపట్ల: సీజనల్ వ్యాధులను నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై 11 శాఖల అధికారులతో గురువారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి, వేటపాలెం మండలాలలో అప్రమత్తం కావాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను విస్మరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. డెంగీ కేసులు నమోదైన చోట ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. చెరుకుపల్లి, నగరం, వేటపాలెం మండలాలలో 8 కేసులు నమోదైనట్లు గుర్తుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఫాగింగ్ చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఇన్‌చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, వైద్య ఆరోగ్యశాఖ తదితరులు పాల్గొన్నారు.