
కనుమరుగవుతున్న చేతి వృత్తులు
●సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య ●భట్టిప్రోలులో చేనేత కార్మికుల నిరసన దీక్ష
భట్టిప్రోలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయని సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని గురువారం భట్టిప్రోలు రథం సెంటర్‌లో ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు నిరసన దీక్ష నిర్వహించారు. చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో గంగయ్య మాట్లాడుతూ చేనేత పరిశ్రమ కనుమరుగుకానున్నదని అన్నారు. పరిశ్రమలో ఉన్న కార్మికుల సంక్షేమానికి కృషి చేయమని ప్రజలు ఎంత మొత్తుకున్నా పాలకులు వినిపించుకునే స్ధితిలో లేరని విమర్శించారు. ప్రభుత్వాల విధానాల వల్ల గ్రామాలలో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా అధికార పార్టీలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. చేనేత పరిశ్రమ రక్షణ కోసం జరిగే పోరాటాల్లో కార్మికులు కలసి రావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జీఎస్టీని వెంటనే రద్దు చేసి చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కోరారు. భారత జాతీయ వారసత్వ సంపదైన చేనేత పరిశ్రమ, కార్మికుల రక్షణ కోసం చేనేత కార్మికులు ఐక్యంగా పోరాడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత కార్మిక సంఘం(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి జి.బాలాజి, చేనేత నాయకులు బి.నాగమల్లేశ్వరరావు, ఎ.శ్రీనివాసరావు, దీపాల సత్యనారాయణ, ఎం.శ్రీలక్ష్మి, బి.రాజకుమారి, జిల్లా రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జి.సుధాకర్, పి.మనోజ్, జి.మురళీకృష్ణ పాల్గొన్నారు.