
కారంచేడు ఘటనపై దగ్గుబాటి వ్యాఖ్యలు అర్థరహితం
చీరాల రూరల్: కారంచేడులో అగ్రవర్ణాలు జరిపిన మారణకాండపై మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ తండ్రి ప్రమేయం లేదని వక్రీకరించి మాట్లాడటం తగదని, కారంచేడు బాధిత పోరాట గ్రామవాసులు పేర్కొన్నారు. ఉద్యమనేత కత్తి పద్మారావుపై చేసిన వ్యాఖ్యలను కూడా కారంచేడు మృతవీరుల సాక్షిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. విజయనగర్ కాలనీలోని కారంచేడు మృతవీరుల రుధిరక్షేత్రం వద్ద గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కారంచేడు పోరాట ఉద్యమ సీనియర్ నాయకుడు దుడ్డు భాస్కరరావు, సిర్రా భగత్‌సింగ్, తేళ్ల సుబ్బారావు, గొర్రెపాటి రవికుమార్, బుడంగుంట్ల లక్ష్మీనరసయ్య మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం భారతదేశ చరిత్రలోనే భయానక ఘటనగా ఆనాడు కారంచేడు దారుణ మారణకాండ జరిగితే దానిని సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్న మాజీ ఎంపీ, ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వక్రీకరించి మాట్లాడడం తగదన్నారు. ఆనాడు వెంకటేశ్వరరావు తండ్రి చెంచురామయ్య ప్రోద్బలంతోనే ఆయన సామాజిక వర్గీయులు.. మాదిగలను మారణాయుధాలతో వెంటాడి వేటాడి హతమార్చినట్లు అప్పట్లోనే వార్తా పత్రికలైన ఉదయం, టైమ్స్ ఆఫ్ ఇండియా, బీబీసీ వంటి ఛానల్స్ నిజ నిర్ధారణ చేసుకున్నాయన్నారు. ఆ తర్వాతే ఆయన తండ్రి పేరును ప్రసారం చేయడం జరిగిందన్నారు. పోలీసులు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును పొందు పరచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం ఆయన తండ్రిని కొంతమంది హతమార్చిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. కారంచేడు ఘటనలో ఆయన తండ్రి ప్రమేయం ఉన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికి ఘటన జరిగిన ఇన్నేళ్లకు తన తండ్రి ప్రమేయం లేదని వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా చెప్పడం చూస్తుంటే భవిష్యత్తులో ఆయన తండ్రి.. దళితజాతి ద్రోహి అనే ముద్రను చెరిపేసుకునేందుకు ఆరాటపడుతున్నారని అర్థమవుతోందని తెలిపారు. కారంచేడు ఘటనలో కీలకంగా పనిచేసి బాధితుల పక్షాన నిలబడి పోరాడిన అప్పటి దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు.. దగ్గుబాటి తండ్రి పేరును పదేపదే ప్రస్తావించడం కూడా మంచి పద్ధతి కాదని ఆయన పేర్కొంటున్నాడని.. ఇది మంచిపద్దతి కాదని వారు హితవు పలికారు. ఇప్పటికై నా వెంకటేశ్వరరావు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని లేకుంటే యావత్ సమాజం, ప్రజా సంఘాల సహకారంతో కారంచేడు బాధిత పోరాట గ్రామవాసులు భవిష్యత్ కార్యాచరణ తీసుకుని ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో దుడ్డు ఏసుపాదం, తేళ్ల ప్రసాద్, దుడ్డు వందనం, తేళ్ల బోయేజు, గొర్రెపాటి వందనం, డేగల నాగరాజు, తేళ్ల రాంబాబు, తేళ్ల ఏసు పాల్గొన్నారు.