
9 నుంచి గుంటూరులో ట్రాఫిక్ మళ్లింపులు
శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత దృష్ట్యా నిర్ణయం
నగరంపాలెం: గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనుల దృష్ట్యా ఈ నెల 9 వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగర పరిధిలో రాకపోకలు సాగించేందుకు ముందస్తు ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పలు తాత్కాలిక మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అందరూ నిబంధనలను పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
వివిధ మార్గాల్లో
మళ్లింపులు ఇలా..
● అమరావతి రోడ్ నుంచి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా (ఎంటీబీ) సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలను చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో మళ్లిస్తారు.
● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇకనుంచి అరండల్‌పేట, పొట్టిశ్రీరాములునగర్, డొంకరోడ్డు, మూడు వంతెనలు లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గం మీదుగా వెళ్లాలి.
● ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు (పాఠశాల, కళాశాల బస్‌లు సహా) రమేష్ హాస్పిటల్ నుంచి కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా ప్రయాణించాలి.
● కోబాల్డ్‌పేట, కృష్ణనగర్, చంద్రమౌళినగర్, బృందావన్‌గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలన్నీ పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి, కలెక్టర్ కార్యాలయం రోడ్డు, నగరంపాలెం మీదగా వెళ్లాల్సి ఉంటుంది.
● పట్టాభిపురం నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్) వైపు వెళ్లే వారు కంకరగుంట రైల్వే ఓవర్‌బ్రిడ్జి, ఎంటీబీ సెంటర్, ప్రభుత్వ మహిళా కళాశాల (ఉమెన్స్ కాలేజ్) వైపు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు మీదగా వెళ్లాలి.
● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు చిల్లీస్, ఇన్నర్‌రింగ్ రోడ్, ఆటోనగర్, బస్టాండ్ లేదా కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాలను ఉపయోగించాలని తెలిపారు.