
రైతన్నను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం
బాపట్ల:కూటమి ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళికి వినతి పత్రం అందించారు. నాగార్జున మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేరన్నారు. ధాన్యంకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతులు ఇప్పట్లో కొలుకునే పరిస్థితి లేదన్నారు. రైతులకు ఎరువులు దొరకుండా బ్లాక్‌మార్కెట్‌లోకి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పడు రైతులను ఆదుకునేందుకు ఆర్బీకే వ్యవస్థను రూపొందించారని గుర్తు చేశారు. ధరల స్థీరీకరణ నిధిని ఏర్పాటు చేయటంతోపాటు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబునాయుడు మళ్లీ అదే ధోరణిలో ఉన్నారని తెలిపారు. రైతులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు లేవన్నారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పర్చూరు సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున బ్లాక్‌మార్కెట్‌లోకి ఎరువులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత