పంట భూములే ప్లాట్లు | - | Sakshi
Sakshi News home page

పంట భూములే ప్లాట్లు

Jul 17 2025 3:48 AM | Updated on Jul 17 2025 3:48 AM

పంట భూములే ప్లాట్లు

పంట భూములే ప్లాట్లు

చీరాల టౌన్‌: భూముల విలువకు రెక్కలు రావడంతో పంట పొలాలు కాస్తా ప్లాట్లుగా మారిపోయాయి. అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసి జనం మోసపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. చీరాల ప్రాంతంలో జనాభా సంఖ్య పెరుగుతుండడంతో పంట పొలాలను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అసైన్డ్‌ భూములను సైతం అమ్మకాలు చేస్తున్నారు. మండలంలోని ఈపూరుపాలెం, తోటవారిపాలెం 216 బైపాస్‌ రోడ్డు, పాత ఎస్సీ కాలనీ రోడ్డు, కుందేరు ఒడ్డు తదితర ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ ఇప్పుడు ఇళ్ల ప్లాట్లుగా మారాయి. వాడరేవు తీరానికి వెళ్లే రోడ్డులో, జాండ్రపేట కుందేరు సమీపంలో, అలానే చీరాల పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీల్లో సైతం ఇష్టానుసారంగా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. ఎన్‌వోసీలు లేకపోయినా అధికార పార్టీ ఆమోదం ఉంటే చాలట కనీసం పంచాయతీ అనుమతి కూడా లేకుండా ప్లాట్లు వేసి అమ్మకాలు చేస్తున్నారు. చీరాల ప్రాంతంలో వేస్తున్న మూడొంతుల లే అవుట్‌లకు కనీస అనుమతులు ఉండడం లేదు. అయినా ప్లాట్లు విక్రయిస్తున్నారు.

కన్వర్షన్‌ ఫీజూ లేదు..

ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును కూడా రియల్టర్లు ఎగవేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట పొలాలను ప్లాట్లుగా మార్చి లే అవుట్‌ వేయాలంటే ఆ పొలం మార్కెట్‌ విలువలో పదో వంతు కన్వర్షన్‌ ఫీజు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత విస్తీర్ణంలో పదో వంతు స్థలం పార్కులకు, రోడ్లు, ఇతర అవసరాలకు వదలాల్సి ఉంటుంది. లే అవుట్‌కు కూడా ప్రభుత్వం తప్పని సరిగా అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు కొందరు భూముల యజమానులతో ములాఖత్‌ అయి అనుమతులు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా ఉంది. పొలాన్ని ప్లాట్లుగా మార్చుకొనేందుకు ప్రభుత్వానికి ఎటువంటి ఫీజులు చెల్లించడం లేదు. నేరుగా ప్లాట్లు వేసి ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఈ అక్రమ లే అవుట్‌లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

గ్రామాల్లో ఇష్టారాజ్యంగా అక్రమ లే అవుట్‌లు ప్రభుత్వ ఆదాయానికి గండి

చర్యలు తీసుకుంటాం

మండలంలో వేసిన లే అవుట్‌లకు అనుమతులు ఉన్నాయో లేవో పరిశీలన చేస్తా. గ్రామాల్లో అనుమతులు లేకుండా వేసిన వెంచర్లు, వాటి వివరాలను సేకరించడంతోపాటు అనుమతులు లేకుండా ప్లాట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. అసైన్డ్‌ భూములను ఆక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా.

–గోపీకృష్ణ, తహసీల్దార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement