
విద్యుత్ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ విక్టర్ ఇమ్మానుయేల్
బాపట్ల: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ ఎన్.విక్టర్ ఇమ్మానుయేల్ హెచ్చరించారు. మంగళవారం విద్యుత్ శాఖ బాపట్ల డివిజన్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతీయ విద్యుత్ పంపిణీ సంస్థ, విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (విజయవాడ) ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అదాలత్, అవగాహన సదస్సుకు ఇమ్మానుయేల్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కర్లపాలెం మండలం గణపవరంలో గ్రామంలో లోఓల్టేజి సమస్య తీర్చేందుకు ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుకు గ్రామస్తుల నుంచి రూ.రెండు లక్షలు వసూలు చేసి ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ట్రానన్స్ ఫార్మర్ ఏర్పాటుకు డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ అంశంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలన్నారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో ఓ పూరి గుడిసెలో విద్యుత్ మీటరుకు ఒకే నెలలో రూ.లక్ష విద్యుత్ బిల్లు వచ్చిందని, దానిని పరిశీలించి ఎందుకు పరిష్కరించలేదని అధికారులను నిలదీశారు. 2020లో ట్రాన్‌న్స్ ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో మురళీకృష్ణ విద్యుత్ శాఖకు డబ్బు జమ చేసినా ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బాపట్ల విద్యుత్ విభాగంలో ఏవోగా పనిచేస్తున్న రామ్ సురేష్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన తీరుపై ఇమ్మానుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే సస్పెండ్‌కు సిఫార్సు చేస్తామన్నారు. స్మార్ట్ మీటర్ల బిగింపు.. ట్రూ అప్ చార్జీలు ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య అధికారుల దృష్టికి తెచ్చారు. సదస్సులో విద్యుత్ శాఖ ఎస్‌ఈ జి.ఆంజనేయులు, సదస్సు సాంకేతిక సభ్యులు ఎస్.శ్రీనివాసరావు, ఆర్థిక సభ్యులు ఆర్.సీహెచ్. శ్రీనివాసరావు, స్వతంత్ర సభ్యులు ఎ.సునీత, ప్రజాసంఘాల నాయకులు టి.కృష్ణమోహన్, కె.శరత్, విద్యుత్ వినియోగదారుల సంఘం బాపట్ల నియోజకవర్గ విభాగం నాయకులు ఆట్ల బాలాజీరెడ్డి పాల్గొన్నారు.