
బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామ దేవత బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారు విజయేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. ఆషాఢమాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వాడరేవు తీరంలో
పర్యాటకుల సందడి
చీరాల టౌన్: మండలంలోని వాడరేవు సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం కావడంతో చీరాల, పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చారు. ఆటలాడుకుంటూ కేరింతలు కొట్టారు. సముద్రంలో స్నానాలు ఆచరించారు. తీరం ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామికి, గ్రామంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం
నరసరావుపేట ఈస్ట్: పులుపుల వారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన స్మార్ట్ కిడ్స్ ఇన్నోవేషన్స్ సంస్థ అధినేత గర్నీ సురేష్ ఈ మొత్తం అందించారు. ఆలయ రాతి నిర్మాణంలో భాగంగా 10వ రాతి స్తంభం నిర్మాణానికి వినియోగించాలని కోరారు. ఆలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విరాళాన్ని మున్నలూరి సత్యనారాయణ ద్వారా కమిటీ ప్రతినిధులకు అందచేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పులుపుల రాము, వనమా కృష్ణ, కోవూరి శివ శ్రీనుబాబు, గజవల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.
వివాదాస్పద పీఈటీపై
విచారణకు ఆదేశం
పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్‌సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్‌లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.
మల్లేశ్వర స్వామి ఆలయానికి తులాభారం బహూకరణ
పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు.

బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు

బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు

బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు