
పర్యాటక కేంద్రంగా పెనుమూడి రేవు
రేపల్లె: కృష్ణమ్మ పరవళ్లను తాకుతూ వీచే చల్లటి గాలులు... చూపరులను ఆకర్షణీయంగా కనువిందు చేసే సహజసిద్ధ దీవులు... దీవులలో పక్షుల కిలకిల రాగాలు.... నదిలో విహరించటానికి నావలు... కాసేపు ఆనందంగా గడిపేందుకు ప్రకృతి అందాలను సంతరించుకున్న ప్రాంతమే పెనుమూడి. ఈ రేవు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఆదాయంతోపాటు తీర ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది.
సహజ సిద్ధంగా దీవులు
పెనుమూడి ప్రాంతంలో కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడ్డ దీవులు మరింత అందాలను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసలదీవిలో కలిసే ముందర కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
బోటు షికారుకు అనుకూలం
పెనుమూడి రేవులో బోటు షికారుకు అనువైన ప్రాంతంగా ఉంది. పెనుమూడి రేవుకు 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉండటంతో ఆటుపోట్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో నీటి పరిమాణం ఏమాత్రం తగ్గుదల ఉండదు. సెలవుల సమయంలో పలు ప్రాంతాల నుంచి వర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చి సాధారణ పడవలు మాట్లాడుకుని సరదాగా తూర్పువైపున ఉన్న దీవిలోకి వెళ్లటంతోపాటు నదిలో ప్రయాణించి సరదాగా గడుపుతూ ఉంటారు. ఆప్రాంతంలో బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతం సినిమా షూటింగ్‌లకు అనువైనదిగా ఉంది. గతంలో చిత్రీకరణలు జరిగాయి. గతంలో జయ జానకీ నాయక సినిమాలో ఒక సన్నివేశం వారధిపై చిత్రీకరించారు. సినీ నటుడు ఆలీ నటించిన పండుగాడు ఫొటో స్టూడియో సినిమాలోని పలు సన్నివేశాలను పెనుమూడి రేవుతోపాటు దీవులలో చిత్రీకరించారు. డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవిత చరిత్రపై తీసిన సినిమాతోపాటు పలు టెలీఫిలిమ్‌ల షూటింగ్‌లు జరిగాయి.
అభివృద్ధికి అనువుగా పెనుమూడి నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దీవులు బోటు షికారుకు అనువైన ప్రాంతం సినిమా షూటింగ్‌లకు తగిన రమణీయ దృశ్యాలు
టూరిజంపై దృష్టి సారించాలి
పెనుమూడి రేవును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం శాఖ దృష్టి సారించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి కలగటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది.

పర్యాటక కేంద్రంగా పెనుమూడి రేవు

పర్యాటక కేంద్రంగా పెనుమూడి రేవు