
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్‌ఐ 9121102168 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధికార ప్రతినిధిగా సంగీతరావు
సత్తెనపల్లి: మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా బొక్కా సంగీతరావు ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎల్‌ఎఫ్ రాష్ట్ర ఇన్‌చార్జి, సీనియర్ న్యాయవాది పూసులూరి జీవా అధ్యక్షతన గుంటూరులో జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన న్యాయవాది బొక్కా సంగీతరావుని ఉమ్మడి గుంటూరు (గుంటూరు, బాపట్ల, పల్నాడు)జిల్లా అధికార ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సంగీతరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో న్యాయవాదుల సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తానన్నారు. మాదిగల 30 ఏళ్ల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నెరవేరడం మాదిగ జాతి ప్రజల అదృష్టమన్నారు. అందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు.
మధ్యాహ్నభోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు
నకరికల్లు: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డెప్యూటీ డీఈఓ ఏసుబాబు హెచ్చరించారు. నకరికల్లులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని గురువారం తల్లిదండ్రులు ఆందోళన చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి చూశారు. నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముందుగా బియ్యం, కూరగాయలు నాణ్యతను పరిశీలించుకున్నాక వండాలని సూచించారు. వంట గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోసారి నాణ్యత లోపించినా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.పుల్లారావు, జాలాది శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు