
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాపట్ల టౌన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎంప్లాయీస్ యూనియన్ లక్ష్యమని ఆ యూనియన్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు, వారికి రావలసిన రాయితీలు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాపట్ల డిపో కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్ ఇప్పించడం, వైద్య సౌకర్యాలు అందించడంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాపట్ల డిపో అధ్యక్షులు టి.చంద్రశేఖర్, టి.యస్.నారాయణ, ఎం.కోటేశ్వరరావు గ్యారేజ్ సెక్రటరీ చలపతి, సి.సి.ఎస్. డెలిగేట్ ఎం.పి.కుమార్, సీనియర్ సభ్యుడు ఐ.యస్.రావు, బాపట్ల జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా చైర్ పర్సన్ పి.రజిని పాల్గొన్నారు.
ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి
వై.ఎస్.రావు