
సహోద్యోగి కుటుంబానికి అండగా కానిస్టేబుళ్లు
చీరాల: సహోద్యోగి అకాల మరణంతో కుటుంబాన్ని ఆదుకునేందుకు తామున్నామంటూ కానిస్టేబుళ్లు ముందుకు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ బిల్లా రమేష్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రూ.1.58 లక్షలను సమకూర్చారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ శుక్రవారం వేటపాలెంలోని బిల్లా రమేష్ ఇంటికి వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న అతని అమ్మమ్మకు నగదును అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ రమేష్ చిన్న తనంలోనే తల్లిని కోల్పోయాడని, అమ్మమ్మ దాసరి సుబ్బులు అన్ని బాధ్యతలు తీసుకుని పెంచి పోషించిందని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కష్టకాలంలో 2009 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన అతడి మిత్రులు నగదును సమకూర్చారని చెప్పారు. ఇది ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రూ.1.58 లక్షలు సమకూర్చిన మిత్రులు