
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
–రేషన్ దుకాణం సీజ్ చేసిన ఆర్డీఓ
చీరాల టౌన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడే డీలర్లపై చర్యలు తప్పవని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని 38 నంబర్ రేషన్ దుకాణంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ, ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైకుంఠపురంలోని 38 నెంబర్ రేషన్ దుకాణదారుడు దుడ్డు ప్రభాకర్ ప్రజలకు బియ్యం, పంచదార సక్రమంగా అందించకుండా నగదు చెల్లించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో దుకాణానికి కేటాయించిన బియ్యం, పంచదారకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. తనిఖీల్లో 300 కిలోల రేషన్ బియ్యం, 57 ప్యాకెట్లు పంచదార అదనంగా ఉండటంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణాన్ని, సరుకులను సీజ్ చేశారు. ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా ప్రజల నుంచి నగదుకు కొనుగోలు చేసినా, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంటే కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. రేషన్ డీలర్లు విధిగా నిబంధనల ప్రకారం సరుకులు పంపిణీ చేసి స్టాక్ రిజిస్టర్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినా, బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన బియ్యం, పంచదారను ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ గీతాకు అందించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ కె.గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.