
వైఎస్సార్ సీపీ నాయకుడిపై ఇనుప రాడ్లతో దాడి
చీరాల అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావూరి బాలకోటిరెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు కావూరి బాలకోటిరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం కొత్తపాలేనికి చెందిన కావూరి బాలకోటిరెడ్డి మంగళవారం చీరాల నగర్‌లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో దండుబాట వద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఈ సమయంలో బక్కా శివప్రసాద్‌రెడ్డి అనుచరులు రాజు సుబ్బారెడ్డి, బక్కా పరుశురామిరెడ్డిలు.. బాలకోటిరెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. రాజకీయంగా గ్రామంలో కీలకంగా మారుతున్నావని.. ప్రజలకు అన్ని విషయాల్లో తోడుంటున్నావని.. నీవు లేకపోతే తమకు అడ్డు ఉండదంటూ దుర్భాషలాడారు. అన్నింటా అడ్డు తగులుతున్నావని, సర్పంచ్‌గా పోటీ చేస్తానని చెబుతున్నావంటూ గాయపరిచారు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. ఈ మేరకు ఒన్‌టౌన్ పోలీసులు బాధితుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేశారు. దాడి సంఘటన సమాచారం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్‌బాబు, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, పార్టీ నాయకులకు ఏరియా వైద్యశాలకు వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. దాడి చేయడం హేయమైన చర్య అని, టీడీపీ పాలనలో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.