
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: వర్షాకాలంలో సీజనల్ అంటు వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దిగువ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్‌లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో అత్యవసరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా నివారించడమే ముఖ్యోద్దేశం అన్నారు. సాధారణం కంటే జ్వరాల కేసులు ఏ ప్రాంతంలోనైనా అధికమైతే వెంటనే సమాచారం పంపాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. ఔషధాల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కాల్వల పూడికతీత పనులు వేగంగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలు, గృహాల మధ్య నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నిర్లిప్తంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. భూమిలో కుళ్లిపోయే స్వభావం ఉన్న వ్యర్థాలను పచ్చ కుండీలు, ప్లాస్టిక్ తదితరమైన వ్యర్థ పదార్థాలను ఎరుపు చెత్తకుండీలో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా, సాగర్ కాల్వల నుంచి నీరు విడుదలవుతున్నందున జిల్లాలోని ఆర్‌డబ్ల్యూఎస్ చెరువులన్నిటిని నింపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.