
ప్రకృతి మాతకు ప్రణామం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరీ ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటుచేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు.
కదంబం కోసం బారులు తీరిన భక్తులు
శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాద పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాద తయారీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుందరికి ప్రసాదం అందేలా చూడాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు.
ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

ప్రకృతి మాతకు ప్రణామం