
దావుపల్లి తండాలో విషాద ఛాయలు
వెల్దుర్తి: మండలంలోని దావుపల్లితండాకు చెందిన జొన్నగిరి రామాంజీ దంపతులు కూలీ పనుల నిమిత్తం మంగళవారం తెల్లవారుజామున యర్రగొండపాలెం వెళ్లి అక్కడ నుంచి బొలేరో వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో శివాపురం వద్ద అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రామాంజీ, అంకమ్మ దంపతులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న తండావాసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని వీరి మృతదేహాలను దావుపల్లితండాకు తీసుకొచ్చారు. మృతదేహాలు తండాలోకి రాగానే ఒక్కసారిగా రోదనలతో దద్దరిల్లింది. వీరికి ఐదు సంవత్సరాల పవన్, మూడు సంవత్సరాల చైతన్య అనే కుమారులున్నారు. పవన్‌కుమార్ 1వ తరగతి చదువుతుండగా చైతన్య ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియగానే పవన్‌కుమార్ రోదిస్తుండగా.. చైతన్య దిక్కులు చూస్తున్నాడు. వీరికి తాతయ్య మాత్రమే ఉన్నాడు. పేద కుటుంబం కావటంతో వీరికి ఎవరూ దిక్కు లేకపోవటంతో తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామాంజీ, అంకమ్మలు రెక్కాడితేకానీ డొక్కాడని పరిస్థితులలో ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. పనులకు వెళ్తూనే పిల్లలను చూసుకుంటూ పవన్‌కుమార్‌ను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారు. సంఘటన తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుర్రి శివారెడ్డి దావుపల్లితండాకు వెళ్లి రామాంజి, అంకమ్మల మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘటన వివరాలు తెలుసుకొని సంతాపం వ్యక్తం చేశారు.