
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ
బల్లికురవ: గ్రానైట్ లారీ డ్రైవర్ మద్యం మత్తుతో రోడ్డు మార్జిన్‌లోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సుమారు కిలోమీటరు దూరం ఆ స్తంభాన్ని లాక్కెళ్లాడు. ఈ ఘటన మంగళవారం అద్దంకి– బల్లికురవ ఆర్‌అండ్‌బీ రోడ్డులోని వల్లాపల్లి అంబడిపూడి గ్రామాల మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం .. అద్దంకి వైపు నుంచి బల్లికురవ, ఈర్లకొండ క్వారీల నుంచి గ్రానైట్ రాళ్లను ఎగుమతి చేసే టైలర్ లారీ ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. బొల్లాపల్లి సబ్‌స్టేషన్ నుంచి పెద అంబడిపూడి, చిన అంబడిపూడి , గుంటుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే మొయిన్ లైన్‌లో స్తంభం రెండు ముక్కలైంది. లారీ మీద పడి కిలోమీటరు దూరం వరకు లాక్కెళ్లింది. ఆ సమయంలో 3 ఫేజ్ విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఏఈ పి. శ్రీనివాస్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందితో కలిసి రెండు గంటపాటు శ్రమించి కొత్త స్తంభం ఏర్పాటుతో సరఫరాను పునరుద్ధరించారు. డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఈ వివరించారు.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ