గుంటూరుమెడికల్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో గుండె పనితీరు పరీక్షలు చేస్తున్న 14 ఏళ్ల బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ సుమారు 14 వేల మంది అమెరికా పౌరులపై రీసెర్చ్ చేశారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలిపారు. సిద్దార్థ్ తాను కనుగొన్న యాప్ ద్వారా జీజీహెచ్‌లో రెండు రోజులుగా పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు. సిద్ధార్థ్‌ను డాక్టర్ యశశ్వి రమణ గురువారం సత్కరించారు. సిద్ధార్థ్‌కు మంచి భవిత ఉందని చెప్పారు. సిద్ధార్థ్‌ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. బాల శాస్త్రవేత్త సిద్ధార్థ్ మాట్లాడుతూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో తాను చేసిన పరీక్షల సందర్భంగా గుర్తించిన అంశాలను వివరించారు. ఐదుగురికి గుండె చప్పుడు ఆధారంగా హుద్రోగం ఉన్నట్టు గుర్తించానని వెల్లడించారు. వీరిలో నలుగురు కార్డియాలజీ విభాగంలో ఓపీకి వెళ్లగా, వారికి గుండె జబ్బు ఉన్నమాట నిజమేనని నిర్ధారణైందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సూపరింటెండెంట్ డాక్టర్ రమణకు కృతజ్ఞతలు తెలిపారు.
20న ఉద్యోగ అవకాశాలపై
అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: ఆరోగ్య రంగంలో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలపై గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో ఈనెల 20న అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సి.హెచ్.నాగేశ్వరరావు తెలిపారు. సదస్సుకు కిమ్స్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతారన్నారు.