
అసాంఘిక చర్యలకు పాల్పడితే రౌడీషీట్
● సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ● ఏఎస్పీ టీపీ విఠలేశ్వర్
చీరాల అర్బన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయంలో అలాగే ముందు రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని ఏఎస్పీ టీపీ విఠలేశ్వర్ తెలిపారు. అలజడులు సృష్టిస్తే.. రౌడీ షీట్ తెరుస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చీరాల నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనల్లో కొంత మందిపై కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. జూన్ 4న కౌంటింగ్ రోజు పట్టణం, రూరల్ గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. గెలిచినా, ఓడినా అందరూ ప్రశాంతంగా ఉండాలన్నారు. సమావేశంలో ఒన్‌టౌన్, టూటౌన్ సీఐలు పి.శేషగిరిరావు, సోమశేఖర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.