గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల వచ్చారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు.
శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయానికి విరాళం
మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలను అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన సోమశెట్టి వెంకటేశ్వర్లు రూ.25 వేలు, ఇదే గ్రామానికి చెందిన సోమశెట్టి రెడ్డెయ్య, రెడ్డిమణిచందన, వరుణ్‌కుమార్‌లు రూ. 25 వేలు అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాతలకు, వారి కుటుంబసభ్యులకు అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దాతలు రూ. 50వేలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాలకృష్ణ, మహేష్, వెంకటరమణ పాల్గొన్నారు.


