మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హార్సిలీ హిల్స్ మూడవ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్(19)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీహిల్స్‌కు పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. మార్గంమధ్యలోని హర్సీలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
ధర్మవరానికి చెందిన ఏడుగురికి గాయాలు


