సాలాబాదులో టీడీపీ నాయకుల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

సాలాబాదులో టీడీపీ నాయకుల దౌర్జన్యం

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల

స్థలం ఆక్రమణ

చమర్తి జగన్‌ మోహన్‌ రాజు ప్రోద్బలంతోనే కబ్జా జరిగిందంటున్న బాధితులు

ఆక్రమణను అడ్డుకోబోయిన మహిళలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు

సాక్షి టాస్కఫోర్స్‌: ఒంటిమిట్ట మండలం సాలాబాదులో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. మండల పరిధిలోని సాలాబాదు గ్రామంలో నాలుగు రోజుల కిందట వైఎస్సార్‌సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మ కు సంబంధించిన 70 ఏళ్లుగా అనుభవంలో ఉన్న సర్వే నెంబర్‌ 833లోని ఒకటి ముక్కాల్‌ సెంటు స్థలాన్ని సాలాబాదు కు చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఆక్రమించాలని చూస్తున్నారు. పశువుల దొడ్డి అంటూ ఆ స్థలంలో టీడీపీ నేతలు ప్రహరీ నిర్మిస్తుండగా.. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు, టీడీపీ నాయకులకు ఘర్షణ జరగడంతో నిర్మించిన ప్రహరీ పడగొట్టారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కూడా అయిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం మళ్లీ ఈ స్థలంలో టీడీపీ నాయకులు ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేశారు. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఘర్షణ జరిగిన నాలుగు రోజులు మౌనంగా ఉన్న సాలాబాదు కు చెందిన టీడీపీ నాయకులు శుక్రవారం అదే గ్రామంలో ప్రజాదర్బార్‌ ముగించుకుని, వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల స్థలానికి పక్కనే ఉన్న ఓ టీడీపీ నాయకుడి ఇంటికి రాజంపేట టీడీపీ ఇంచార్జ్‌ చమర్తి జగన్‌ మోహన్‌ రాజు భోజనానికి వచ్చారు. చమర్తి ప్రోద్బలంతోనే తమ స్థలానికి గ్రామానికి చెందిన పశువుల దొడ్డి అనే పేరు పెట్టి ఆయన ఘటనా స్థలానికి రాకుండా ఆయన వర్గీయులతోనే నిర్మాణ పనులు చేయించారని బాధితులైన వైఎస్సార్‌సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రహరీ నిర్మాణ సమయంలో నిర్మాణాన్ని అడ్డుకోబోయిన స్థల యజమాని కుంటుంబ సభ్యులైన మహిళలను ఒంటిమిట్ట పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరుగుతుండగా అక్కడి కి వచ్చిన సాక్షి టీవీ, పేపర్‌ విలేకరులు అక్కడే ఉన్న చమర్తి వాహనాన్ని చిత్రీకరిస్తుండగా సాలాబాదు పంచాయతీ, మలకాటిపల్లి గ్రామంలోని టీడీపీ కి చెందిన ఓ నాయకుడు ఎదైనా తీసుకో గానీ..చమర్తిని, ఆయన వాహనాన్ని చిత్రీకరించరాదని హుకుం జారి చేశారు. అలా కాదని చిత్రీకరిస్తే ‘మేము చేసే పని మేము చేస్తామని’ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని స్థలానికి సంబంధించి పత్రాలు ఏవైనా ఉంటే స్థానిక తహసీల్దార్‌ వద్దకు తీసుకెళ్లి చట్టపరంగా స్థలాన్ని పొందాలని స్థల యజమానులైన వైఎస్సార్‌సీపీ మద్దతురాలు తిప్పన పుల్లమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు ఆయన వివరించారు.

వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ

స్థల యజమానులతో మాట్లాడుతున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాసులు

Advertisement
 
Advertisement
Advertisement