త్వరలో పూర్తిగా చేయిస్తాం
● మండీల్లో అమలు కానీ
చిన్నక్రీట్లవిధానం
● 4 నెలలుగా కాలయాపన చేస్తున్న
వైనం
గుర్రంకొండ: స్వయానా జిల్లా కలెక్టర్ ఆదేశాలనే గుర్రంకొండ మార్కెట్‌యార్డులో మండీల యజమానులు భేఖాతర్ చేస్తున్నారు. జిల్లా అంతటా చిన్నక్రీట్ల (15కేజీలు) విధానం అమలులో ఉన్నా గుర్రంకొండలో మాత్రం నాలుగు నెలలు గడుస్తున్నా ఈ విఽధానం అమలు కాకపోవడం గమనార్హం. దీంతో మళ్లీ రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
దోపిడి విధానంతో తిరగబడిన రైతులు
గుర్రంకొండ మార్కెట్‌యార్డులో ఐదునెలల క్రితం టమాటా మండీల యజమానులు జాక్ పాట్ పేరుతో నిలువుదోపిడీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. రెండురోజుల పాటు మార్కెట్‌యార్డు గేటు తాళాలు వేసి ఎన్‌హెచ్ 340 జాతీయ రహదారిపై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. మండీల్లో జాక్‌పాట్‌లపేరుతో వ్యాపారులు, దళారులు తమను నిలువునా దోచుకొంటున్నారంటూ పేర్కోన్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకెత్తించింది. వరుస ఆందోళనలతో ఓవైపు మార్కెట్ కమిటీ అధికారులు, మరోవైపు జిల్లా రెవెన్యూ అధికారులు విడతల వారీగా గుర్రంకొండలో పర్యటించారు. మండీలను ముమ్మరంగా తనిఖీలు చేసి రైతుల సమస్యలపై అధ్యయనం చేశారు. రైతులతోనూ, మండీల యజమానులతోను పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. జాక్‌పాట్‌ల పేరుతో వందకు పదిక్రీట్లు వ్యాపారులు దౌర్జన్యంగా లాక్కొంటున్నారని, వీటికి తోడు టమాటాల వేలం సమయంలో క్రీట్లపై రాశులగా పోస్తున్నారని, కమీషన్లు అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు ఆధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి నెల ఒకటో తేది నుంచి చిన్నక్రీట్ల విధానం అన్ని మండీలల్లో ఆమలు చేయాలని అధికారులు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు.
నాలుగునెలలుగా
అమలు కాని విధానం:
నాలుగునెలలు గడుస్తున్నా చిన్నక్రీట్ల విధానం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. స్థానిక మార్కెట్‌కమిటీ అధికారులు నెలల తరబడి మండీల యాజమానులు, వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి చిన్నక్రీట్ల విధానాన్ని అమలు చేయాలంటూ పలుమార్లు సూచించారు. అయితే పలువురు మండీల యజమానులు ఇటు జిల్లాకలెక్టర్, మరోవైపు స్థానిక మార్కెట్‌కమిటీ అధికారుల ఆదేశాలను భేఖాతర్ చేస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. గుర్రంకొండ మార్కెట్‌యార్డు పరిధిలో మొత్తం 25 టమాటా మండీలను నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి రెండు మండీలు మాత్రమే పూర్తిస్థాయిలో చిన్న క్రీట్లవిధానాన్ని అమలు చేస్తున్నాయి. మిగిలిన మండీల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు ఆమలు చేస్తున్నారు. ఈ విధానం అమలు ప్రక్రియ నెలల తరబడి సాగదీస్తుండడం గమనార్హం
జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు
చిన్న క్రీట్ల విధానం అమలు చేయకపోవడంపై టమాటా రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు లేనిపోని కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. కొన్ని మండీలల్లో చిన్నక్రీట్లు, మరికొన్ని మండీల్లో 25కేజీల క్రీట్ల విధానం అమలు చేస్తుండడంతో పరిస్థితి తికమకగా మారుతోందని రైతులు పేర్కొన్నారు. ఈవిషయమై జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులను అప్పటికప్పుడు పిలిపించి జిల్లా కలెక్టర్ సంజాయిషీఅడిగినట్లు రైతులు పేర్కొన్నారు.
గుర్రంకొండలోని అన్ని మండీలలో వందశాతం చిన్నక్రీట్ల విధానాన్ని త్వరలో అమలు చేయిస్తాం. రెండు మండీల్లో ఇప్పటికే వందశాతం చిన్నక్రీట్లను రైతులకు ఆందుబాటు లో ఉంచారు. మిగిలిన మండీల వారు చిన్నక్రీట్లను బుక చేసి డబ్బులు చెల్లించేశారు. త్వరలోనే మండీలకు స్టాకు వస్తుంది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో అన్నిమండీల్లో చిన్నక్రీట్ల విధానం అమలు చేస్తాం. – సునీల్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వాల్మీకిపురం


