సాక్షి, మదనపల్లె: మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి అన్నారు. మదనపల్లె ఎన్జీవో హోంలో గురువారం ఐద్వా జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సావిత్రి మాట్లాడుతూ మహిళలపై దాడులు, అత్యాచారాలకు గంజాయి, మాదకద్రవ్యాల వినియోగమే కారణమన్నారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో అక్కడి సీఎం 780 మద్యం దుకాణాలను రద్దు చేశారని అన్నారు. చంద్రబాబు ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వాలని కోరడమేటని ప్రశ్నించారు. వారిని పెంచి పోషించాలంటే ఎంత భారమో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథుడు బాలికపై లైంగిక దాడి చేస్తే పోలీసులు అరెస్టు చేయకపోవడాన్ని నిలదీశారు అతన్ని అరెస్ట్ చేసి చట్టపరంగా కటడినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆదాని, అంబానీలకు ప్రభుత్వాలు సంపదను దోచిపెడుతున్నాయని అన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సిద్దంగా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యతులో ఐద్వా చేపట్టే పోరాటాలకు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘాలు, సీఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, అంగన్వాడీ, ఆశా సంఘాలు అండగా ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, పట్టణ కార్యదర్శి రెడ్డి ప్రసన్న, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐద్వా సభ్యులు హాజరయ్యారు.


