మదనపల్లె టౌన్ : ఆటో కోసం రోడ్డు పక్కన నిలుచుని ఉన్న వ్యక్తిని బొలెరో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం ఉదయం గుర్రంకొండ మండలంలో జరిగిన ఘటనపై బాధితుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ మెయిన్ బజార్లో నివాసం ఉంటున్న షేక్ మునీర్‌బాషా (52) గుర్రంకొండలోని మదనపల్లె రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం అర్థరాత్రి వరకు విధులు నిర్వర్తించి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు ఆటోకోసం వేచి ఉండగా బొలెరో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిక్షించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు బాధితున్ని రుయాకు తరలించారు. గుర్రంకొండ ఎస్సై రవీంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థులకు..
మదనపల్లె టౌన్ : ఆర్టీసీ బస్సు ఢీకొని సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం కురబలకోట మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితులు, ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యసాయి జిల్లా, కదిరి మండలం, పూటాగులకు చెందిన సంతోష్ (20), యస్వంత్ (20) ఎంసెట్ పరీక్ష రాయడానికి మదనపల్లె మండలం, పుంగనూరు రోడ్డులోని ఆదిత్య కళాశాలకు బైక్‌లో వచ్చారు. పరీక్ష రాసి ఇద్దరూ తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్టపై కి వెళ్లగానే ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థులు ఇద్దరికి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబీకులు బాధితులను వెంటనే సత్యసాయి జిల్లాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముదివేడు ఎస్‌ఐ మధురామ చంద్రుడు తెలిపారు.


